MBNR – శనివారం అర్ధరాత్రి మహబూబ్ నగర్లో భారీ వర్షం – స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన మంత్రి డాక్టర్.వి శ్రీనివాస్ గౌడ్.

@శనివారం అర్ధరాత్రి మహబూబ్ నగర్లో భారీ వర్షం .
@ శివ శక్తి నగర్ ప్రాంత కౌన్సిలర్ కుమారుడు నవకాంత్ ఎక్సైజ్ శాఖ మంత్రి కి ఫోన్
@విషయం తెలిసి డ్రైవర్ అందుబాటులో లేకున్నప్పటికి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన మంత్రి డాక్టర్.వి శ్రీనివాస్ గౌడ్.
శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ విషయం ఉదయం 3 గంటల 50 నిమిషాలకు శివశక్తి నగర్ మున్సిపల్ కౌన్సిలర్ కుమారుడు నవకాంత్ ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కు ఫోన్ ద్వారా తెలుపగా డ్రైవర్ లేకున్నప్పటికీ మంత్రి తానే స్వయంగా బైక్ నడుపుతూ హుటా హుటిన ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పట్టణంలోని పెద్ద చెరువు తెగిపోయి ఉండవచ్చన్న అనుమానంతో మంత్రి పెద్ద చెరువు, రామయ్య బౌలి ,శివశక్తి నగర్ లలో పర్యటించారు. అయితే చెరువు తెగిపోలేదని ,కానీ భారీ వర్షం వల్లనే వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నదని మంత్రి గుర్తించి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన బి. కె. రెడ్డి కాలనీ,క్రిస్టియన్ పల్లి,వన్ టౌన్,న్యూ టౌన్,లక్మి నగర్ కాలనీ,శ్రీనివాస కాలనీ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,జిల్లా ఎస్ పి ఆర్.వెంకటేశ్వర్లు తో కలిసి పర్యటించారు.
అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ తో పాటు ,మండల స్థాయి అధికారులతో భారీ వర్షాల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ప్రస్తుతం ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ మళ్లీ భారీ వర్షాలు వచ్చేందుకు అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కిందిస్థాయి సిబ్బంది అప్రమత్తం కావాలని మంత్రి ఆదేశించారు. అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా అప్రమత్తంగా ఉండి వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ అధికారులు చెరువులు, కుంటలను తనిఖీ చేయాలని, ఎక్కడైనా చెరువులు తెగేందుకు ఆస్కారం ఉన్నా,లేదా గతంలో తెగిపోయిన దాఖలాలు ఉంటే వాటిని గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. రహదారులపై వాగులు ,వంకలు పొంగి ప్రవహిస్తున్న చోట ప్రమాదాలు జరగకుండా, ఎవరిని రోడ్డు దాటకుండా నిరోధించడమే కాకుండా, అవసరమైతే గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. తాసిల్దార్ లు ,ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా తిరిగి తెగేందుకు ఆస్కారమున్న చెరువులు, రహదారులను గుర్తించాలని, మహబూబ్నగర్ పట్టణంలోని పెద్ద చెరువు, కొత్తచెరువు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, చెరువులలో పూడిక తీసేందుకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ముఖ్యంగా హనుమాన్ పుర, వీరన్నపేట్, శివశక్తి నగర్, వంటి ప్రాంతాలను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సందర్శించాల్సింది గా ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం కావాలని ,అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, అంబులెన్సులు అందుబాటులో ఉండాలని, మందులు,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అంతేకాకుండా తాగునీటి పైపులైన్లు,డ్రైన్ పైపులు రెండూ కలిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ ఏస్. వెంకట రావు,ఎస్ పి ఆర్. వెంకటేశ్వర్లు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, తహసిల్దారులు,ఎం పి డి వోలు,మున్సిపల్,పంచాయతి రాజ్ అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Share This Post