@మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డున పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
@ పాత కలెక్టరేట్ నూతన కలెక్టరేట్ కు మారిన వెంటనే ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడతాం.
@సంవత్సరం లోపు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ని అందుబాటులోకి తీసుకు వస్తాం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
శుక్రవారం రాత్రి ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి పై సమీక్ష సందర్బంగా ఈ విషయం తెలిపారు.
పాత కలెక్టరేట్ భవనం లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం వల్ల ఎదురుగానే బస్టాండు, మరి కొద్ది దూరంలో రైల్వేస్టేషన్ ఉంటాయని, బస్సులు,ట్రైన్ ల ద్వారా వచ్చిన పేద ప్రజలకు తక్షణమే అంబులెన్స్ లో ఆస్పత్రికి చేరుకునే అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. పట్టణంలోని రహదారులు వెడల్పు చేయడం వల్ల రద్దీ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్టాండ్ నుండి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి వచ్చేందుకు రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు నిర్మిస్తున్నామని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సరిపడా బ్లాకులు, ఫ్లోర్ ల తోపాటు, పార్కింగ్ ,ఆసుపత్రి ముందు పార్కుల ఏర్పాటు, హైదరాబాద్ తరహాలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ కి వచ్చి చికిత్స పొందేలా నిర్మిస్తామన్నారు.పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు.
ఆసుపత్రి నమూనా ప్రకారం ప్రతి ఫ్లోర్లో బ్లాక్ లు ఏర్పాటు చేసి, లిఫ్టులు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ తో పాటు, పార్కు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సందర్బంగా ఆయన ఆసుపత్రి నమూనాను ప్రదర్శించారు.
2014 ముందు మహబూబ్ నగర్ జిల్లా లో ఒక్క ఐ సి యు బెడ్ కూడా లేదని, ఇప్పుడు 70 పడకల ఐ సి యు బెడ్లు, అదేవిధంగా 540 ఆక్సీజన్ బెడ్లు ఉన్నాయని,2 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ,ఒక ఆక్సిజన్ స్టోరేజ్ ప్లాంట్ ఉన్నాయని తెలిపారు. సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణంతో
రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ మెడికల్ హబ్ కానుందని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,జిల్లా ఎస్ పి. ఆర్.వెంకటేశ్వర్లు,ఆదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్,సీతా రామారావు,తదితరులు ఉన్నారు.