MBNR – సెప్టెంబర్ 1 నాటికి అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో సిద్ధం – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు.

సెప్టెంబర్ 1 నాటికి అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో సిద్ధం – జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
సెప్టెంబర్ 1 నుండి పాఠశాల పునః ప్రారంభం అవుతున్న దృష్ట్యా మరోసారి జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ పాఠశాలల పరిశుభ్రం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఆయన జిల్లా అధికారులతో పాఠశాల పరిశుభ్రత పై సమీక్షించారు. ఇప్పటివరకు పాఠశాలల్లో పరిశుభ్రం, మరుగుదొడ్లు పరిశుభ్రత ,హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ, పిచ్చి మొక్కల తొలగింపు, పాఠశాల ఆవరణలో గుంతలు లేకుండా నీరు నిల్వ ఉండకుండా మొరం వేయడం తదితర అంశాలపై సమీక్షించారు.పాఠశాల పరిశుభ్రత పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 1 నుండి పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహించనున్నందున మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఏ పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం ఆగిపోవడానికి వీలులేదని ,ఒకవేళ ఎక్కడైనా అగిపోయినట్లయితే సంబంధిత కాంప్లెక్స్ పాఠశాల హెడ్మాస్టర్, ఎంఈవోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 31న కృష్ణాష్టమి సెలవు ఉన్నప్పటికీ ఎం ఎల్ ఎస్ పాయింట్లన్నీ తెరిచి ఉంచాలని ఆయన ఆదేశించారు.
సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పాఠశాలల్లో హస్త పరిశుభ్రత మాసోత్సవం నిర్వహించాలని, ఇందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఈ ఓ లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ అంశంపై తహసిల్దారులు,ఎం పి డివోలు, హెడ్మాస్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని చెప్పారు.
పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఒకవేళ ఎవరికైనా విద్యార్థులకు కోవిడ్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెల్లి చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత డి ఎం హెచ్ ఓ,డి ఈ ఓ ల పై ఉందని ఆయన అన్నారు. రాబోయే రెండు నెలలు పాఠశాలలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
అన్నీ అంగన్వాడీ కేంద్రాలలో పాఠశాలల మాదిరిగానే గర్భిణీ స్త్రీలు,పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను, కళాశాలలను వెంటనే మూసివేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు
అన్ని విద్యా సంస్థలకు తప్పనిసరిగా తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, ఇంకా ఎక్కడైనా తాగునీటి కనెక్షన్ ఏర్పాటు చేయకుంటే తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ ఏ ఈ లు రోజుకు పది పాఠశాలల చొప్పున పది రోజుల్లో అన్ని పాఠశాలల్లో మిషన్ భగీరథ తాగునీటి శాంపిళ్లను సేకరించి పంపాలని తెలిపారు. అంతేకాక ప్రతి విద్యా సంస్థకు విద్యుత్ కనెక్షన్ ఉండాలని అన్నారు. అన్ని అంగన్వాడి కేంద్రాలు శుభ్రం చేసినట్లు అంగం వాడి టీచర్ ,పంచాయతీ కార్యదర్శులు సంతకంతో ధ్రువ పత్రం సమర్పించాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆర్ బి ఎస్ కె బృందాలు పాఠశాలలు సందర్శిస్తాయని, విద్యార్థులకు కోవిడ్ సమస్య రాకుండా పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. సూపర్వైజరి అధికారులు ప్రతి రోజు 10 పాఠశాలలను సందర్శించే లాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 864 పాఠశాలలకు గాను 853 పాఠశాలలో పరిశుభ్రంగా చేయడం జరిగిందని, తక్కినవి ఈరోజు పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా 824 తరగతి గదులను సాని టైజ్ చేశామని , 817 పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రం చేయడం, 816 పాఠశాలలో వంట గదులు,వంట పాత్రలు శుభ్రపరచడమే కాకుండా, 801 పాఠశాలలో తాగునీటి వనరులను శుభ్రం చేయడం జరిగిందని, 734 పాఠశాలలో తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డిఆర్ఓ కె.స్వర్ణలత, ఆర్డిఓ పద్మశ్రీ ,జడ్పీ సీఈఓ జ్యోతి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

Share This Post