MBNR – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు కోరారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు కోరారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సహాయ రిటర్నింగ్ అధికారులు, జెడ్పి సి ఈ ఓ లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ నెల 9వ తేదీన షెడ్యూలు ప్రకటించినందున అదే రోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, అందువల్ల అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూ.చా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను వెంటనే పూర్తి చేయాలని ,ఇందుకుగాను తక్షణమే జడ్పిటిసి ,ఎంపిటిసి, మున్సిపల్ కౌన్సిలర్, ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలతో కూడిన ఓటరు జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పూర్వపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాలైన ప్రస్తుత జిల్లా కేంద్రాలుగా ఉన్న అన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలతో పాటు, నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ,అదేవిధంగా షాద్ నగర్ మరియు వికారాబాద్ పరిధిలోకి వచ్చే మూడు మండలాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే తెలియజేస్తామని వెల్లడించారు.ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఎన్నికల పై వెంటనే సమావేశం నిర్వహించాలని, ఓటరు జాబితాను పంపించడంతోపాటు, పోలింగ్ కేంద్రాల జాబితాను స్కేచ్ తో సహా ఇవ్వాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో చనిపోయినవారు, అర్హత కోల్పోయిన వారి పేర్లు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై అన్ని జిల్లాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పోలీసులతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై చర్చించాలని,నోడల్ అధికారుల నియామకాన్ని పూర్తి చేయాలని వెల్లడించారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నందున అన్ని పోలింగ్ కేంద్రాల కు సంబంధించి బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ నుండి పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల లో ప్రాధాన్యత క్రమంలో ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని, బ్యాలెట్ పేపర్ పై 1 ,2, 3 అంకెలు వేయవలసి ఉంటుందని తెలిపారు .ఎన్నికలలో పూర్తి పారదర్శకతకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ తో పాటు, సూక్ష్మ పరిశీలకులను నియమిం చాలని ఆదేశించారు. పోలింగ్ రోజున ఎంపీడీవోలు, తహసీల్దార్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఇందుకు గాను వారిని ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు.వెంటనే వీడియో సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు .
ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఈఆర్ఓ మరియు సహాయ రిటర్నింగ్ అధికారి,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, నారాయణపేట అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి ,వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, గద్వాల అదనపు కలెక్టర్ రఘురామ శర్మ,షాద నగర్ ఏ ఆర్ ఓ రాజేశ్వరి,జెడ్ పి సి ఈ ఓ లు, డిప్యూటీ సి ఈ వో లు, మున్సిపల్ కమిషనర్లు,తదితరులు హాజరయ్యారు .

Share This Post