స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ బాధ్యత కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట రావు అన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న జిల్లా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసే ప్రచారానికి సంబంధించిన అంశాలను ముందుగా ఎం సి ఎం సి ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసే అంశాలకు ఎం సి ఎం సి ముందస్తు అనుమతి ఇస్తుందనితెలిపారు. ఇందుకుగానూ అభ్యర్థులు 48 గంటల ముందు ప్రచారం చేయాల్సిన అంశాలను ఎం సి ఎం సి కి సమర్పించాలని, ఆ అంశాలను ఎం సి ఎం సి సభ్యులు క్షున్నంగా పరిశీలన చేసిన అనంతరం అనుమతులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. అన్ని ఎన్నికలలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు.
స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల్లో అధికారులందరూ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తో పాటు, రంగారెడ్డి జిల్లా షాద్నగర్, వికారాబాద్ జిల్లాలోని 3 మండలాలు కలుపుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ ఎన్నికలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎస్ ఆఫీసియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు మొత్తం కలిపి 1445 వరకు ఓటర్లు ఉన్నారని ,ఓటర్ల జాబితాను ఈ నెల 15న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు, పూర్వపు అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ప్రస్తుత జిల్లా కేంద్రాలు అలాగే అన్ని రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ప్రచురించడం జరిగిందని ,ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20 వరకు స్వీకరించడం జరుగుతుందని, ఎవరైనా వారి అభ్యంతరాలను ఈ ఆర్వో మరియు రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఓటర్ జాబితాను ఉమ్మడి జిల్లాలలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రచురించడం జరిగిందని, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతున్నదని, పూర్తి బ్యాలెట్ పేపర్ పద్ధతి పై నిర్వహించే ఈ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటును ఓటరు తప్పనిసరిగా వేయవలసి ఉంటుందని తెలిపారు.
ఓటర్లు ఓటు వేసేందుకు పూర్వపు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ప్రస్తుతం అన్ని జిల్లా కేంద్రాలు, అదేవిధంగా నాగర్ కర్నూల్ లోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే షాద్నగర్, వికారాబాద్ జిల్లా కొడంగల్ లో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా తాను సహాయ రిటర్నింగ్ అధికారిగా,ఈ ఆర్ ఓ గా రెవెన్యూ ఆదనపు కలెక్టర్, అలాగే తక్కిన జిల్లాల అదనపు కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని, అంతేగాక షాద్నగర్ ఆర్ డి ఓ కూడా సహాయ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు.
ఈ నెల 9 నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించినందున ఆ రోజు నుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలను తెలియజేయడం జరిగిందని, అదేవిధంగా అన్ని జిల్లాల లో కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం గా అన్ని ఇక్కడినుండే నిర్వహించడం జరుగుతుందని ,అయితే వాహనాల అనుమతులకు సంబంధించి సహాయ రిటర్నింగ్ అధికారులు ఇస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నికలలో భాగంగా ఎఫ్ ఎస్ టి,ఎస్ ఎస్ టి,వి ఎస్ టి బంధాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ ఆధనపు కలెక్టర్ మరియు ఎం ఎల్ సి ఎన్నికల ఈ ఆర్ ఓ కె.సీతా రామారావు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు. వెంకటేశ్వర్లు ,ఎం సి ఎం సి సభ్యులు జగపతి రావు,ఇశ్రా నాయక్ , కలెక్టర్ కార్యాలయ ఏవో. ప్రేమ్ రాజ్, డిటిసి మేనేజర్ గోపాల్ గౌడ్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.