MBNR – 18 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లోటు లేకుండా చూడాలని వైద్యాధికారుల ను ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన వారందరు తప్పనిసరిగా వాక్సిన్ తీసుకునెలా జడ్పీటీసీలు, ఎంపీపిలు, సర్పంచులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు పోటీ తత్వంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వంద శాతం వాక్సిన్ ఇవ్వటంలో భాగంగా వెంకటేశ్వర కాలనీ లో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.
కరోనకు మందు వాక్సిన్ అని, అందువల్ల ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. దేశంలో అత్యధికంగా వాక్సిన్ ఉత్పత్తి అవుతున్నది హైదరాబాదులోనేనని, అంతేకాక ప్రపంచ జనాభాలో 40 శాతం జనాభాకు హైదరాబాద్ నుండే వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని,ఇతర దేశాలలో ఒక డోసుకు వేల రూపాయలు వెచ్చించి తీసుకుంటున్నారని,కానీ రాష్ట్రంలో ఉచితంగా వాక్సిన్ ఇస్తున్నందున 18 ఏళ్ళు పై బడిన ప్రతి ఒక్కరు వాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకొని వారి గ్రామాలు,మున్సిపల్ వార్డులో 100 శాతం వాక్సిన్ పూర్తి కి కృషి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్,డి ఐ ఓ శంకర్,డెమో తిరుపతి రావ్, స్థానిక కౌన్సిలర్ రోజా తదితరులు హాజరయ్యారు.

Share This Post