MBNR – 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు.

18 సంవత్సరాలు పైబడిన వారందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ నూటికి నూరు శాతం కోవిడ్ వాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
ఈ విషయమై బుధవారం ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులు, జెడ్ పిటి సి లు,ఎం పి పి లు,సర్పంచులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోవిడ్ వాక్సినేషన్ లో భాగంగా జిల్లాలో 589252 మంది 18 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సిన్ ఇచ్చేందుకు గుర్తించి ఇప్పటి వరకు 263623 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని ,తక్కిన వారందరికీ యుద్ధప్రాతిపదికన వాక్సిన్ ఇవ్వాలని ఆయన కోరారు.

జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి రేపటినుండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. అయితే వాక్సిన్ విషయంలో ఎవరినీ బలవంత పెట్టొద్దని ,వాక్సిన్ తీసుకునే విధంగా చైతన్యం చేయాలని సూచించారు.
18 సంవత్సరాలు పైబడిన వారికి వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వడం లో భాగంగా మండల, గ్రామస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,ఎం పి పి లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి ,అంగన్వాడి, ఆశ అందరూ ఈ విషయం పై చర్చించి విజయవంతం చేయాలన్నారు.ఇందుకు గాను ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని, ఎవరిని వదలకుండా అందరికీ వ్యాకజిన్ ఇచ్చేలా చూడాలని, అన్ని ఏ ఎన్ ఎం సెంటర్లలో ఈ నెల 16 నుండి వాక్సిన్ ఇవ్వాలని, ఇందుకు ఒక షెడ్యూల్ రూపొందించాలని, వాక్సినేషన్ షెడ్యూల్ తో పాటు ,ఇంటింటిని పరిశీలించేందుకు షెడ్యూల్, ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ లు రూపొందించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయమై జిల్లా స్థాయిలో తక్షణమే కంట్రోల్ రూమ్ ప్రారంభించాలని ఆదేశించారు.గ్రామపంచాయతీలు,మున్సియాలిటీ లలో ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించాలని మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్లు ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.జిల్లా, అధికారులు మండల స్థాయి అధికారులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. కార్యక్రమాన్ని శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు .ఈ విషయంలో ఆర్ బి ఎస్ కె బృందాలు ముఖ్యమైన పాత్ర పోషించాలని వాక్సిన్ విషయంలో ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత మెడికల్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదే విషయంపై ఉదయం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హనుమకొండ నుండి జిల్లాలోని అందరు కలెక్టర్లు, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ 100 శాతం వాక్సిన్ వేయాలని, కరోనాను ను కట్టడి చేసిన విధంగానే ఇది కూడా విజయవంతం చేయాలని ,సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఒక ఛాలెంజ్గా తీసుకొని పని చేయాలని ,గ్రామ సర్పంచులు, వార్డ్ సభ్యులు ,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపిలు, అందరూ పాల్గొనాలని కోరారు.అన్ని గ్రామాలలో వాక్సిన్ కేంద్రాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఐకేపీ మహిళలను భాగస్వాములుగా చేయాలని, రైతు వేదికలను కూడా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. రేపటి నుండే గ్రామాలలో 18 సంవత్సరాలు పైబడిన వారికి నూటికి నూరు శాతం వాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాల వారీగా, హమ్లెట్స్ జాబితా రూపొందించుకోవాలని, స్పెషల్ ఆఫీసర్లు, ఆశ ,అంగన్వాడీ కార్యకర్తలు షెడ్యూల్ రూపొందించాలని, షెడ్యూల్ ప్రకారం వాక్సినేషన్ పూర్తి చేయాలని,100 శాతం పూర్తయిన గ్రామాలు, మున్సిపల్ వార్డులో బ్యానర్లు ఏర్పాటు చేయాలని, నిర్దేశించిన సమయం ప్రకారం ఇది పూర్తి చేయాలని ,అవసరమైన చోట వాహనాలు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధుల తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ,డి ఐ ఓ శంకర్ ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,డి పి ఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో జ్యోతి,మండల స్థాయి అధికారులు, వైద్యాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు ,ఎంపీడీలు ,ఎంపీపిలు, సర్పంచులు ,జెడ్ పి టి సి లు తదితరులు హాజరయ్యారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందికి వాక్సిన్ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేశారు

కంట్రోల్ రూమ్ నంబర్ 08542-241165

Share This Post