MBNR – మహబూబ్ నగర్ మెడలో మరో మణిహారం సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి.

@ మహబూబ్ నగర్ మెడలో మరో మణిహారం సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి
@ పాత కలెక్టరేట్ స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
@ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ల ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర స్థాయి అత్యున్నత వైద్య బృందం పాత కలెక్టరేట్ సందర్శన
పాలమూరు వలసల జిల్లా అనే పేరును చెరిపేస్తూ అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఒక్క మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకే కాకుండా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, ఇటు రాయచూరు, అటు కర్నూలు ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించాలనే ఉద్దేశంతో జిల్లాకు 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చిన ఘనత ఎక్సైజ్ శాఖ మంత్రిది.
ఆసుపత్రిని మంజూరు చేయించడమే కాకుండా ఆసుపత్రి పనులను వెంటనే చేపట్టి సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మంత్రి అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి అత్యున్నత వైద్య బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ఎస్ డి . డాక్టర్ గంగాధర్ ,డి ఎం ఈ రమేష్ రెడ్డి ల నేతృత్వంలో గురువారం పాత కలెక్టరేట్ ను పరిశీలించింది. పనులు చేపట్టేందుకు గాను టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో అన్ని రకాల వైద్య సేవలను అందించడంతోపాటు, బహుళ అంతస్థులలో భవనాల నిర్మాణం,అత్యాధునిక యంత్ర పరికరాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు వివిధ బ్లాక్ లు ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ మంత్రి తలంపు.
ముఖ్యంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బస్టాండ్, రైల్వేస్టేషన్ కు దగ్గరగా ఉండటం , పట్టణం నడిబొడ్డున ఉండటం వల్ల ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. హైదరాబాదు లోని కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలన్నది మంత్రి అభిమతం. దానికి తగ్గట్టుగానే ఆయన అడుగులు వేస్తూ అధికార యంత్రాంగాన్ని, వైద్యాధికారులను ఆసుపత్రి నిర్మాణం వైపు పరుగులు పెట్టిస్తున్నారు.
వైద్యబృందం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.ఈ ఆస్పత్రిలో జనరల్ ఆసుపత్రి తో పాటు, వైద్యులు, సిబ్బంది క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, ఫ్యాకల్టీ క్వార్టర్స్ , పార్కింగ్ తదితర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టేందుకు వైద్య బృందం కలెక్టరేట్ మొత్తాన్ని తిరిగి పరిశీలించింది.
అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్లో సమావేశమై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కావాల్సిన స్థలము తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ దగ్గరుండి వైద్య బృందానికి పాత కలెక్టర్ స్థలాన్ని చూపించడం జరిగింది.
టి ఎస్ ఎం ఐ డి సి ఎం డి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్,ఎస్ ఈ సురేందర్ రెడ్డి ,స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రామరాజు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామ్ కిషన్, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ ప్రేమ్ రాజ్, తాసిల్దార్ పార్థసారథి తదితరులు ఉన్నారు.

Share This Post