పత్రిక ప్రకటన–1 తేదీ : 16–08–2021
============================================
ధరణిని పకడ్భందీగా అమలు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి
రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశంలో ఇంఛార్జి కలెక్టర్ హరీశ్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ధరణిని పకడ్భందీగా అమలు చేసేలా సంబంధిత తహశీల్దార్లు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం ధరణి పై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ హరీశ్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తహశీల్దార్లు,ఆర్డీవో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ధరణిలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా వ్యవసాయ సంబంధిత భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని సూచించారు. ఈ విషయంలో స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు ముందుగానే వారి సెల్‌ఫోన్‌కు సమాచారం అందేలా చూడాలని… రిజిస్ట్రేషన్ రోజున తప్పకుండా అన్ని పనులు పూర్తి చేయాల్సిందిగా వివరించారు. ధరణి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆయా మండలాల తహశీల్దార్లు ప్రతిరోజూ ఉదయం 10.20 గంటలకే ఆన్లైన్లో లాగిన్ కావాలని అన్నారు. ధరణిలో మ్యూటేషన్లు, వారసత్వ బదలాయింపులు వంటివి ఏమాత్రం పెండింగ్ లేకుండా చూడాలని… మ్యూటేషన్లు మరీ పాతవైనట్లయితే వాటిని రిజెక్టు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి వివరాలను గుంటల రూపంలో అందించాలని అన్నారు. భూముల విషయంలో వస్తున్న ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రామాల వారీగా, సర్వే చేసి ప్రభుత్వ భూముల వివరాలు, ప్రస్తుత తాజా పరిస్థితులపై నిర్ణీత నమూనాలో నివేదికలు అందచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. అనంతరం ధరణిపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి,మల్లయ్య, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.