MNCL : అక్షరాస్యతతోనే అభివృద్ధి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చదువులో రాణించి 100 శాతం అక్షరాస్యత సాధించినప్పుడు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాసిపేట మండలంలో ఆదర్శ పాఠశాల, వసతిగ్భహ భవనం, తాండూర్‌లో కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాల, వసతిగ్భహ భవనం, బెల్లంపల్లిలో బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రారంభిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, శాసనమండలి సభ్యులు దండే విఠల్‌, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యలతో హాజరై ఆసరా పెన్నన్లు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళినా తెలంగాణ బిడ్డలు ముందుండే విధంగా విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కె.జి. టు పి.జి. విద్యనందించడమే ధ్యేయంగా దాదాపు 1 వేయి గురుకులాలు 10వ తరగతి వరకు, 1 వేయి 150 జూనియర్‌ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలలో 53 డిగ్రీ కళాశాలలు ప్రత్యేకంగా అమ్మాయిల కొరకు, 5 పి.జి. కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదర్శ పాఠశాలల్లో 1 లక్షా 25 వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు విద్యనందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విదేశీ విద్యానిధి పథకంలో ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం ద్వారా దాదాపు 4 వేల మందికి పైగా విద్యార్థులు విదేశాలలో చదువుతున్నారని తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక ఇంజనీరింగ్‌ కళాశాల, ఒక గురుకులం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వయోవృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గిత కార్మికులు, బోదకాలు బాధితులు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆత్మాభిమానంతో జీవించే విధంగా ఆసరా పెన్షన్‌ పథకం ద్వారా ప్రతి నెల పెన్షన్‌ అందించడం జరుగుతుందని, మానవీయ కోణంలో డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులకు సైతం పెన్షన్‌ అందించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.ను ఇంటికి పెద్ద కొడుకుగా భావించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఆడపడుచు పండగ వస్తే అమ్మవారింటి వైపు చూస్తుందని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీర అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post