MNCL : ఆకెనపల్లి గ్రామ రైతుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలోని బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ రైతులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను, సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవితో కలిసి ఆకెనపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. చాలా సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో రైతుబంధు, రైతుభీమా తదితర పథకాలు అందడం లేదని, గోనె వెంకటముత్యంరావు పట్టాదారుగా ఉన్న భూములలో 50, 60 ఏండ్లుగా తాము కాస్తు కాలములో ఉంటూ సాగు చేసుకుంటున్నామని పలువురు రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, ఆకెనపల్లి గ్రామంలో వివిధ సర్వే నంబర్లలో మొత్తం 499 ఎకరాల పట్టా భూమి ఉండగా ఇందులో 300 మంది రైతులు కాస్తు కాలంలో ఉంటూ సాగు చేసుకుంటున్నారని, ఇందుకు సంబంధించిన ధృవపత్రాలను రైతుల నుండి సేకరించామని, ఈ విషయాలపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తహశిల్దార్‌ కుమారస్వామి, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post