జిల్లా పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, ప్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పనులలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కొనసాగుతున్న వనులను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పథకం క్రింద అర్హులైన శ్రామిక కుటుంబాలకు పని కల్పిస్తూ ఉపాధి అందించడం జరుగుతుందని, అర్హులైన వారిని గుర్తించి జాబ్ కార్డులు అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులలో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో చెల్లింపులు చేయడం జరుగుతుందని, ఉపాధిహామీ పథకం క్రింద మంజూరైన పనులకు అనుమతులు పొందిన తరువాత కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనసాగుతున్న పనుల పురోగతిపై ఫోటోలను అప్లోడ్ చేయాలని, అర్హులైన కూలీలకు మాత్రమే పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులపై జరిగిన సోషల్ ఆడిట్ బృందం వారు తనిఖీ చేసిన అంశాలను ఆధారాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. అన్ని జిల్లాలలో ఎన్.పి.ఎ.లను రెండు శాతం కంటే తక్కువకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, స్త్రీ నిధిలో అర్హత కలిగిన అందరు సభ్యులకు సాధారణ రుణాల ద్వారా 40 వేల రూపాయల వరకు రుణం అందించేందుకు కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నిర్ధేశిత లక్ష్యాల సాధన దిశగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బ్యాంక్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఎన్.పి.ఎ. పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, స్త్రీ నిధి పథకం క్రింది మహిళల అభ్యున్నతి కొరకు రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, టైెనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.