ఓటు అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా స్పష్టమైన జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023 లో నూతన ఓటరు నమోదు, జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన జాబితా రూపొందించాలని అన్నారు. ఎస్. ఎస్.ఆర్. -2023 లో భాగంగా ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆయా తేదీలలో సంబంధిత అధికారులు కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రము వద్ద ఓటరు నమోదు దరఖాస్తు ఫారములు అందుబాటులో ఉంచాలని, ఓటర్లు తమ వివరాలను పరిశీలన చేసుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో సంబంధిత ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గం॥లోగా హాజరు కావాలని, సంబంధిత సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని, అనధికారికంగా గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు బూత్ స్థాయి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని తెలిపారు. గోడ ప్రతులు, కరపత్రాలు, గ్రామీణ ప్రాంతాలలో ఆటోలతో మైకుల ద్వారా విసృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు, పేరు, చిరునామా ఇతర వివరాల సవరణ,
మరణించిన వారి వివరాల తొలగింపు ప్రక్రియను పారదర్శకంగా ఎలాంటి అలసత్వం వహించకుండా పకదృంధీగా చేపట్టాలని తెలిపారు. దివ్యాంగుల వివరాల నమోదు కొరకు సదరం శిబిరాలను వినియోగించుకోవాలని, ప్రత్యేక శిబిరాలపై దినపత్రికలు, కేబుల్ ఛానళ్ల ద్వారా అందరికీ సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘ నిబంధనల మేరకు ముసాయిదా జాబితా ప్రతిలోని వివరాలను నిర్ధారించుకోవడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాబితా అందించాలని, నూతన ఓటరు నమోదు చేసుకునేందుకు ప్రస్తుతం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, కళాశాలల్లో అర్హత యువతీ, యువకులు తమ ఓటును నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023 లో భాగంగా జిల్లా
అధికారుల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఓటరు జాబితా రూపొందించడంలో చేపట్టే పనులకు అందరు హవాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నామని, రోజువారి నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారికి అందించడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఓటరు నమోదు కొరకు ఫారం-6, విదేశాలలో నివాసముంటున్న భారతీయులు (ఎన్. ఆర్.ఐ.) ఓటు నమోదు కొరకు ఫారం-6ఎ, ఓటరు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం కొరకు ఫారం-6బి, ఓటరు జాబితాలో పేరు చేర్చడం / తొలగించడం కొరకు ఫారం-7, చిరునామా మార్పు / వివరాల సవరణ / ఓటరు కార్డు భర్తీ / వైకల్యం ఉన్న వ్యక్తుల గుర్తింపు కొరకు ఫారం-8 లను వినియోగించడంతో పాటు ఆన్లైన్, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ల ద్వారా కూడా వివనాల నమోదు చేసుకోవడంపై పురపాలక సంఘాలు, గ్రామీణ ప్రాంతాలలో గోడప్రతులు, ఆటోలలో మైకులు, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ట్రాన్స్‌జెండర్స్, సెక్స్ వర్మర్లను గుర్తించి వారి వివరాలను కూడా జాబితాలో నమోదుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.