MNCL : కంటి వెలుగు శిబిరాల లక్ష్యాలను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2 విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను లక్ష్యాలను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, ట్రెనీ కలెక్టర్‌ పి.గౌతమి, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి.సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్షల 53 వేల 342 మందికి పరీక్షలు నిర్వహించి 34 వేల 85 మందికి రీడింగ్‌ గ్లాస్‌లు పంపిణీ చేయడం జరిగిందని, 26 వేల 807 మందికి ప్రిస్కిష్షన్‌ గ్లాస్‌ల కొరకు పంపించడం జరిగిందని, జిల్లాలో ఇప్పటి వరకు అందిన 2 వేల 243 ప్రిస్కిష్పన్‌ గ్లాస్‌లను లబ్టిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ, లక్ష్యాల సాధనలో వైద్యాధికారులు, సిబ్బంది పని తీరు అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని 112 గ్రామపంచాయతీలు, 55 వార్డులలో కంటి వెలుగు శిబిరాల లక్ష్యాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందించవలసిన ప్రిష్కిష్షన్‌ గ్లాసులను త్వరితగతిన అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలలో లక్ష్యాలను పూర్తి చేయడానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయంతో 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని, వైద్యాధికారులు సమయపాలన పాటించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉండాలని, ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు, ప్రోగ్రాం అధికారులు డా! నీరజ, డా॥ అనిత, డా విజయ పూర్ణిమ, డా॥ విజయనిర్మల, డి.డి.ఎం.లు బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post