MNCL : కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

అంధత్వ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు, ప్రజల కంటి సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండల పరిధిలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి ప్రారంభించిన అనంతరం చెన్నూర్‌ పట్టణంలోని (బాహ్మణవాడ, భీమారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరాలను సందర్శించారు. శిబిరాల నిర్వహణ తీరును టేబుళ్ళ వారిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారని, ఈ క్రమంలో గురువారం రోజున జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 40 కంటి వెలుగు శిబిరాలను ఒకేసారి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం గ్రామీణ ప్రాంతాలలో 27 శిబిరాలు, పట్టణ ప్రాంతాలో 13 శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి శిబిరంలో 8 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ పని దినములలో శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కంటి సమస్య ఉన్న వారిని పరీక్షించి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు, రీడింగ్‌ అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సమస్యకు తగినట్లుగా కంటి అద్దాలు అందుబాటులో లేనట్లయితే 3 నుండి 4 వారాలలోగా అందించడం జరుగుతుందని తెలిపారు. 100 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలను జిల్లాలోని 18 సం॥లకు పైబడి ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, కంటి వైద్య నిపుణుల ద్వారా కంటి సమస్యను పరీక్షించి అవసరం ఉన్న వారికి మాత్రమే కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజలు అపోహలు వీడి శిబిరానికి రావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌, మందమర్రి మున్సిపల్‌ కమీషనర్‌ రాజు, వైద్యాధికారి డా॥ నీరజ, చెన్నూర్‌ మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, జిల్లా పరిషత్‌ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post