క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సిఎం కప్ 2023 క్రీడా పోటీలను నిర్వహిస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, మద్యపాన నిషేధ, క్రీడా యువజన సేవలు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో గల ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సి.ఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కళాశాలలు, పాఠశాలలు, గురుకులాలను ప్రారంభించి విద్యను అందించడం జరుగుతుందని, వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని, దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. దేశంలో అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆ దిశగా రాష్ట్రంలోని దాదాపు 16 వేల గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గానికి ఒక స్టేడియం ఉండాలని ప్రభుత్వ ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 55 స్టేడియంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. క్రీడాకారులకు అందించే నగదు పురస్కారాన్ని పెంచడం జరిగిందని, అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఠాగూర్ స్టేడియంను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, బెల్లంపల్లి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టేడియం ను ఏర్పాటు చేసేందుకు అధికారులతో ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. సి ఎం కప్ కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభగల క్రీడాకారులను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అనేక భారీ సంస్థలు పరిశ్రమల స్థాపనకు రాష్ట్రానికి వస్తున్నాయని, అనేక పరిశ్రమలకు రాష్ట్రం హబ్ గా మారిందని అన్నారు.
ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో గల ఠాగూర్ స్టేడియంను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా మార్చేందుకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. గతంలో ఖనిజ సంపద, ప్రజలతో కళకళలాడిన రామకృష్ణాపూర్ పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఠాగూర్ స్టేడియం ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతోమంది క్రీడాకారులు క్రీడలలో రాణించారని, రక్షణ శాఖతో పాటు అనేక ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు సాధించారని అన్నారు. క్రీడ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా ఈనెల 15 నుండి 17వ తేదీ వరకు మండల స్థాయిలో, 22 నుండి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. 18 క్రీడలలో 133 విభాగాలలో దాదాపు 3 వేల మంది క్రీడాకారులు 18 మండలాల నుండి పోటీలకు హాజరయ్యారని, ఈ నేపథ్యంలో పోటీల కొరకు 1 ఫుట్బాల్, 2 కబడ్డీ, 2 వాలీబాల్, 2 ఖో ఖో కోర్టులు, 1 రన్నింగ్ ట్రాక్, 1 బాస్కెట్బాల్, 1 హ్యాండ్ బాల్ కోర్టులు, బాక్సింగ్, రెజ్లింగ్ రింగులు, టేబుల్ టెన్నిస్ ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోటీలకు హాజరైన క్రీడాకారులు, శిక్షకులకు భోజన వసతి, త్రాగునీరు కల్పించడం జరిగిందని, ఒక మొబైల్ మెడికల్ వ్యాన్, మొబైల్ మూత్రశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 3 రోజులపాటు జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని అన్నారు. గోదావరి, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలు కలిగిన మంచిర్యాల జిల్లాలో క్రీడాకారులకు చైతన్యంగా ఉండేందుకు సహజ శక్తి ఉంటుందని, ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తే జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయవచ్చని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తిగా తీసుకొని, మళ్లీ నిర్వహించే సి ఎం కప్ క్రీడా పోటీలకు సన్నద్ధం కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గీతా కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.