మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన పనుల లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రితో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన పనుల లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కెనాల్, చెరువులలో పూడికతీత పనులను పూర్తి చేయాలని తెలిపారు. పనుల నిర్వహణలో కూలీల హాజరు శాతం పెంచాలని, కేటాయించిన పనులను వేగవంతం చేయాలని, అధికారులు పనుల నిర్వహణను నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న పనులు, లక్ష్యం, కూలీల సంఖ్య అంశాలపై గ్రామపంచాయతీల వారిగా సమీక్ష నిర్వహించాలని తెలిపారు. నిర్ధేశిత లక్ష్యాలను మళ్ళీ నిర్వహించే సమావేశంలోగా పురోగతి సాధించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాలలో కూలీ పని చేసే వారి కుటుంబాలను గుర్తించి 100 రోజుల పని కల్పించాలని, పనుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై కార్యచరణ రూపొందించుకొని లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలలో భాగంగా జిల్లాలో నిర్ధేశించిన ప్రకారంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లను నిర్వహించాలని, త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల మేరకు క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామాగ్రిని సమకూర్చాలని తెలిపారు. జిల్లాలోని 311 గ్రామాలలో 253 గ్రామాలలో ఏర్పాటుకు గుర్తించడం జరిగిందని, 22 గ్రామాలలో పనులను పూర్తి చేయబడి, 37 గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయని, గ్రామాల పరిధిలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో తలెత్తిన భూ సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత ఆర్.డి.ఓ., తహళశిల్దార్లు చొరవ చూపాలని, గ్రామాల సంబంధిత తహశిల్దార్, ఆర్.ఐ. సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, అందులో ఉపయోగకరమైన చెత్తను వేరు చేసి కంపోస్ట్ షెడ్ ద్వారా వర్మి కంపోస్టు తయారికి వినియోగించాలని, అనంతరం పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాలకు తరలించి మొక్కల అభివృద్ధికి వాడటంతో పాటు విక్రయానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రీ నిధి పథకంలో మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 79 శాతం బ్యాంక్ లింకేజీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో పన్నులను 100 శాతం వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పల్లేప్రకృతి, బృహత్ పల్లెప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.