జిల్లా క్షయ వ్యాధి నివారణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి నిర్వహించిన ర్యాలీని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. జి.సి. సుబ్బారాయుడు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సులేమాన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధిని నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా విన్నత స్థాయి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 25 కేంద్రాల ద్వారా క్షయ వ్యాధి సంబంధిత పరీక్షలు, చికిత్స అందించడం జరుగుతుందని, జిల్లాలో 183 మంది క్షయ వ్యాధి బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, ప్రతి నెల ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం హిందూ సేవక్ సమాజ్ ఆధ్వర్యంలో
5 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా॥ నీరజ, ప్రోగ్రామ్ అధికారి ఫయాజ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, వైద్య, నర్సింగ్ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.