జిల్లాలోని పర్యాటన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్‌తో కలిసి అధికారులతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నడిబొడ్డున హరిత గెస్ట్‌హౌస్ కొరకు 2 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు స్థలం కేటాయిస్తే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో గల చిన్నయ్య గుట్ట, పెద్దయ్య గుట్ట పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద గోదావరి నదిలో బోటింగ్, మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద గల గాంధారిఖిల్లా, గాంధారి వనం అభివృద్ధి, మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువులో బోటింగ్, చెన్నూర్ నియోజకవర్గంలోని కిష్టంపేట వద్ద బోటింగ్ అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలు చేయడంతో పాటు జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న హరిత గెస్ట్‌హౌస్‌ను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హరిత గెస్ట్‌హౌస్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారిని ఆదేశించారు. జిల్లా ప్రజలకు పర్యాటక రంగ అభివృద్ధి, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తరుపున సిద్దంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు దాసరి వేణు, శ్యామలాదేవి, జిల్లా క్రీడా, యువజన సర్వీసుల శాఖ, పర్యాటక అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.