MNCL : జిల్లా అభివృద్ధికి అందరు సమన్వయంతో పని చేయాలి : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ

అధికార యంత్రాంగం, (ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత, జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌తో కలిసి హాజరయ్యారు. 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అందరితో జాతీయ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జిల్లాలో జరిగే సంక్షేమ, అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో నిర్వహించే సదరం శిబిరాన్ని అర్హత గల వారు సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు జిల్లా ఆసుపత్రి నుండి సిఫారసు ద్వారా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని తెలిపారు. విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాల పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా పరిధిలో జంతు సంక్షేమ సంస్థను ప్రారంభించడం జరిగిందని, జంతు హింసపై పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రకృతిలో జంతువులు కూడా భాగమేనని, మూగజీవితాలను హింసించడం చట్టరీత్యా నేరమని, వాటి రక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం సంబంధిత దెబ్బతిన్న పైప్‌లైన్స మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మండలాల పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణం, మరమ్మత్తుల విషయంలో సంబంధిత అనుమతులు వచ్చిన వెంటనే పనుల్పుఆరంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని రైస్‌మిల్లర్లు వారికి అందించిన ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా అందించి నిర్ధేశిత లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు చేపట్టాలని, పేదలకు అందించి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులలో ఆయా సంబంధిత శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post