MNCL : జూన్‌ 3 నుండి 18వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయి పరిశుభ్రతతో పాటు పచ్చదనం, అన్ని సౌకర్యాలతో ఆధునీకరించి గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి సాధించడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమాన్ని జిల్లాలో జూన్‌ ౩ నుండి 18వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోకళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌లో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్భులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలే లేని గ్రామాలు తీర్చిదిద్దేందుకు పల్లెప్రగతి నిరంతరాయంగా 365 రోజులు చేపట్టవలసిన కార్యక్రమమని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం వలన ఎలాంటి వ్యాధులు దరి చేరవని, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించడం వలన ఎలాంటి కాలుష్యం లేని స్వచ్చమైన వాయువు ద్వారా జీవవైవిద్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజలలో చైతన్యం కల్పిస్తూ వారిని ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. మొదటి, రెండు, మూడు, నాలుగు విడతలలో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఇదే స్ఫూర్తితో 5వ విడత కార్యక్రమాన్ని అందరు సమిష్టిగా విజయవంతం చేయాలని తెలిపారు. నూతన పంచాయతీ చట్టం ప్రకారం గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగాలని, ఇందుకు గాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం క్రింద అవసరమైన చోట పనులు చేపట్టలని తెలిపారు. గ్రామాలలో బహిరంగ ప్రదేశాలు, కూడళ్ళు, రోడ్లపై చెత్త పడవేసిన వారికి జరిమానా విధించాలని, గ్రామాలలో వ్యవసాయ పనులు లేని రోజులలో ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని తెలిపారు. జిల్లాలో స్వచ్చభారత్‌ పథకం క్రింద 99.8 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 2019లోనే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో ప్రతి ఇంటికి వెళుతూ ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్భులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post