MNCL : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

తెలంగాణ రాష్ట్ర సంస్పృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లాలో వేడుకలు ప్రారంభించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక పండుగ బతుకమ్మ అని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పూలను పూజించే ప్రత్యేకత ఉందని తెలిపారు. పౌష్టికాహారం తీసుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలని, నేటి బాలలు ఆరోగ్యంగా ఉంటేనే రేపటి భవిష్యత్‌ తరాలు బావుంటాయనే ఉద్దేశ్యంతోనే మహిళా, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకను నిర్వహించడం జరిగిందని అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలలో మహిళలతో అనుసంధానమైన ప్రభుత్వ శాఖలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ నుండి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని తెలిపారు. కరోనా కారణంగా ఇంతకు ముందు వేడుకలు జరుపుకోలేకపోయామని, ప్రస్తుతం కరోనా నుండి బయటపడ్డామని, బతుకమ్మ పండుగకు పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. అందరు కలిసి జరుపుకునే బతుకమ్మ పండుగతో మన మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయని, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మహిళందరినీ ఏకతాటిపై తీసుకువచ్చేందుకు బతుకమ్మ పండుగ ఎంతో ఉపయోగపడిందని, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు లేకుండా పండుగ జరుపుకోకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లాలో దాదాపు 2 లక్షల 50 వేల బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు బతుకమ్మ వేడుకలలో స్వచ్చందంగా భాగస్వామ్యులై విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post