ఖరీదైన భూములను నామమాత్రపు ధరతో పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు అందించడం ద్వారా యాజమాన్య హక్కు కల్పిస్తూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండలం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన జీ.ఓ.76 అమలు ద్వారా 4వ విడత సింగరేణి స్థలాల ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, ట్రైనీ కలెక్టర్ గౌతమి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం సింగరేణి స్థలాలలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న అర్హులైన లబ్దిదారులకు పట్టాలు అందించేందుకు జీ.ఓ. 76 ద్వారా కృషి చేస్తుందని, ఇది బృహత్తర కార్యక్రమమని అన్నారు. తాను స్వయంగా సింగరేణి సంస్థలో 26 సంవత్సరాల పాటు పని చేసి పదవీ విరమణ పొందానని, ఈ క్రమంలో సింగరేణి సంస్థ విషయాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. కార్మికులుగా సంస్థలో పని చేసి పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఆర్థిక సమస్యల కారణంగా సొంతింటిని ఏర్పాటు చేసుకోలేకపోతారని, ఈ సమస్యలను తెలుసుకొని తెలంగాణ ప్రభుత్వం అర్హులను గుర్తించి సింగరేణి స్ధూల క్రమబద్దీకరణ ద్వారా పట్టాలు అందజేయడం జరుగుతుందనని, ఇప్పటి వరకు 8 విడతలుగా పట్టాలు అందించి ఇప్పుడు 4వ విడత కార్యక్రమంలో 273 మందికి ఇండ్ల పట్టాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సింగరేణిలో అసాధ్యమైన విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు ప్రజల సమస్యలు తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి అనేక మార్గాల ద్వారా కృషి చేస్తూ ప్రజలు, కార్మికుల పక్షాన పని చేస్తున్నారని అన్నారు.
అనంతరం ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ సింగరేణి స్థూల ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించి 1032 మందికి, 2వ విడత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా 367 మందికి, 3వ విడత రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా 300 మందికి పట్టాలు పంపిణీ చేసి 4వ విడతలో భాగంగా 273 మందికి పట్టాల పంపిణీ చేయడం జరుగుతుందని, దీనితో 1972 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. ఈ క్రమంలో 1040 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని, 576 మంది డి.డి. తీయని వారు ఉన్నారని, 211 మంది దరఖాస్తులు విచారణ స్థాయిలో ఉండగా 130 మంది రిజిస్ట్రేషన్ స్థాయిలో మొత్తంగా 917 మందికి పట్టాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. తిరస్కరించిన దరఖాస్తులను పునర్విచారణ జరిపి అర్హులను గుర్తించడం జరుగుతుందని, మిస్సింగ్ ఏరియాలకు సంబంధించి దరఖాస్తులకు అవకాశం కల్పించి పట్టాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకొని సింగరేణి ఖాళీ స్థలాలలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న అర్హులైన వారికి జీఓ. 76 ద్వారా క్రమబద్దీకరణ చేసి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. 100 గజాలలో ఉన్న వారికి 1 రూపాయి తీసుకోకుండా పట్టా చేయడం జరుగుతుందని, 100 నుండి 500 గజాల నివాస స్థూల వారికి కేవలం 25 రూపాయలు, 501 నుండి 1000 గజాల వరకు 250 రూపాయలు మాత్రమే రుసుము నిర్ణయించడం జరిగిందని, పారిశ్రామిక స్థలాలకు 500 గజాల వరకు 100 రూపాయలు, 501 నుండి 1000 గజాల వరకు 500 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్న వేలాది మందికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఖరీదైన భూములలో ప్రభుత్వం నామమాత్రపు ధరను నిర్ణయించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి భూముల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా ప్రభుత్వం పట్టాలు అందించడం ద్వారా యాజమాన్య హక్కులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రామకృష్ణాపూర్లోనే కాకుండా కోల్‌బెల్ట్ ప్రాంతంలోనే ప్రజలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ఎంతో చారిత్రాత్మక ఘనత కలిగిన సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, గత ప్రభుత్వాలు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను నిలిపివేయడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వంలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకువచ్చి సింగరేణి బిడ్డలకు ఉపాధి కల్పించడం జరిగిందని, మెటర్నిటీ సెలవులను 24 వారాలకు పెంచి సింగరేణిలోని మహిళా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని, అంబేద్కర్ జయంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ హాలీడేస్ అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ సంస్థ అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడి ఉన్న సంస్థను రాష్ట్ర ఏర్పాటు తరువాత అభివృద్ధి తేసి కార్మికులకు లాభాలలో 30 శాతం వాటా చెల్లించడం జరుగుతుందని
తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ కళ, వైస్‌చైర్మన్ సాగర్‌రెడ్డి, సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.