ప్రజలు నియంత్రిత సంస్థల నుండి అవసరమున్నంత బుణం మాత్రమే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నెల 13 నుండి 17 వరకు నిర్వహించనున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు-2023 సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన బ్యాంక్ ఉద్యోగుల 2 కె.ఎం. వాకథాన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి దాసరి వేణుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, ఏవైనా కొనుగోలు చేసే ముందు ప్రణాళిక తయారు చేసుకొని అవసరం మేరకు తెలివిగా ఖర్చు చేయాలని, పొదుపు చేసే అలవాటు ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతుందని, సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్ అవసరాలకు కేటాయించాలని తెలిపారు. ప్రస్తుతం అధికమవుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో బుణాలు అందించే మొబైల్ యాప్‌ల నుండి అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ సంబంధిత సమాచారం కోసం వినియోగించే నంబర్‌ను బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ నుండి పొందాలని, ఓ.టి.పి., సి.వి.వి., పాస్‌వర్డ్, పిన్, బ్యాంక్ ఖాతా, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని, డిజిటల్ సేవలు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉన్నా కూడా వాటి వినియోగంలో మోసాలకు గురి కాకుండా డబ్బు నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆ దిశగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని నియంత్రిత బుణ సంస్థల నుండి మాత్రమే బుణాలు తీసుకోవాలని, బుణం పొందే ముందు నియమ, నిబంధనలను జాగ్రత్తగా చదవాలని, చెల్లించవలసిన వడ్డీ ఇతర వివరాలను తెలుసుకోవాలని, మొబైల్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా వాడేందుకు అనుమతించే ముందు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతూ కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి రోజు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఎక్కడా చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, మురుగు కాలువ పూడికతీత పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ సాజిబ్‌కుమార్ సాహు, బ్యాంకు ఉద్యోగులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.