జిల్లాలోని నిరుద్యోగులలో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించి తదనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ కల్పనలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, సంక్షేమ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, ఎం.డబ్య్యు.ఓ. శాఖల అధికారులు, బ్యాంకర్లు, మున్సిపల్, కార్మిక శాఖ కమీషనర్లతో జిల్లా స్కిల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతను గుర్తించి నైపుణ్య శిక్షణ ద్వారా మరిన్ని మెళకువలు నేర్పించి వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు తగు కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ, ఎం.జి.ఎన్.ఎఫ్. డా॥ వివేకవర్ధిని, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హవేలి రాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.