ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించే దిశగా ప్రభుత్వం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్ద కేంద్రాలలో ఉచిత శిక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గానికి 200 మంది చొప్పున 600 మంది నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఎస్.ఐ., పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శారీరక ధారుడ్య పరీక్షల కోసం 13వ బెటాలియన్‌లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమయం వృధా కాకుండా, వ్యయ ప్రయాసల ఇబ్బందులు లేకుండా నియోజకవర్షాల పరిధిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ తరగతులను ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగతతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, లైబ్రేరియన్ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.