MNCL : పల్లెప్రగతి పనుల నిర్వహణలో అలసత్వం వద్దు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమ నిర్వహణలో అధికారులు అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం జిల్లాలోని జైపూర్‌ మండలంలోని శివ్వారం, పౌనూరు, వేలాల గ్రామపంచాయతీల పరిధిలో జరుగుచున్న పల్లెైప్రగతి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లెప్రగతి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా నిర్ధేశిత గడువులోగా పనులు వేగవంతం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామాలలోని రోడ్లపై, ఖాలీ ప్రదేశాలలో ఎక్కడా కూడా చెత్త వేయకుండా పర్యవేక్షించాలని, ఇళ్ళ ముందు, కిరాణ షాపుల ముందు చెత్తవేసిన వారికి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే విధంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాల పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 2022-23 సంవత్సరానికి గాను నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీలలో సిద్దం చేయాలని తెలిపారు. శివ్వారంలో జరుగుతున్న పాఠశాల మరుగుదొడ్ల పనులను పరిశీలించి గుత్తేదారుకు పలు సూచనలు, సలహాలు చేశారు.

ఈ కార్యక్రమంలో జైపూర్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, శివ్వారం, పౌనూరు, వేలాల సర్పంచ్‌లు గణేష్‌, సారయ్య, శ్యామల, పంచాయతీ కార్యదర్శులు శ్వేత, సుప్రియ, స్వర్ణలత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post