రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సంచాలకులు దేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌళిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు – మన బడి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ, ఖాళీల జాబితాలను రూపొందించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, వాటిపై అభ్యంతరాలను స్వీకరించాలని, జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు పోషించిన పాత్ర అభినందనీయమని, ఆదర్శ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఆదర్శ పాఠశాలల (ప్రారంభానికి సన్నద్దం చేయాలని, 2 రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని, మన ఊరు – మన బడి క్రింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపొందించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలో 248 పాఠశాలలను గుర్తించడం జరిగిందని, ఇందులో 158 ప్రాథమిక పాఠశాలలు, 31 ప్రాథమికోన్నత పాఠశాలలు, 59 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, 242 పాఠశాలలకు పాలనా అనుమతులు, 240 సాంకేతిక అనుమతులు జారీ చేయడం జరిగిందని, 30 లక్షల రూపాయల వ్యయం లోపు 218 పాఠశాలలు, 30 లక్షల రూపాయల వ్యయానికి పైబడి 80 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద 97 వంట శాలలు, 155 మూత్రశాలలు, 185 ప్రహారీగోడ పనులు చేపట్టడం జరిగిందని, వీటిలో 57 వంట శాలలు, 109 మూత్రశాలలు, 100 ప్రహారీగోడ పనులు గ్రౌండింగ్ చేయబడి మిగతా పనులను పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.