నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్లను అర్హులైన పేదలకు మాత్రమే పారదర్శకంగా ఇండ్లను కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ ప్రాంతంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అర్హులను మాత్రమే గుర్తించి లాటరీ పద్దతిన ఎంపిక చేయడం జరిగిందని, ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 650 ఇండ్లు లక్ష్యం కాగా 30 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులకు అందజేయడం జరిగిందని, 330 ఇండ్లను జనవరి 15, 2023 నాటికి పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. అర్హుల ఎంపిక ప్రక్రియలో కేటగిరీల వారిగా అర్హులను గుర్తించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రతి కేటగిరీలో ౩ శాతం దివ్యాంగులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాల శాఖ ఈ.ఈ. రాము, మంచిర్యాల ఆర్.డి.ఓ. వేణు, తహశిల్దార్ రాజేశ్వర్, మంచిర్యాల మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.