MNCL : పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

పల్లెప్రగతి 5వ విడత కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుండి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లాలోని కన్నెపల్లి మండలం జనకాపూర్, భీమిని మండలం రాంపూర్‌, మల్లిడి, వెంకటాపూర్‌ గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని, విధులలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ఎక్కడా చెత్త ఉండకుండా సంబంధిత పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామంలో కూలీపోయే దశలో ఉన్న ప్రహారీగోడను చూసి సంబంధిత ఇంటి యజమానికి నోటీసు ఇచ్చి వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్సులను ఆదేశించారు. బృహత్‌ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అధిక మొత్తంలో మొక్కలు నాటి సంరక్షించాలని, బృహత్‌ పల్లెప్రకృతి వనానికి గేటు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి భీమిని మండలం రాంపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి ఖోఖో, వాలీబాల్‌ కోర్ట్‌లను పరిశీలించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. మల్లిడి గ్రామంలో పారిశుద్ధ్యం పరిశీలినలో భాగంగా వాటర్‌ ట్యాంక్‌ను పరిశీలించి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణ కల్పనపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వెంకటాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల సంరక్షణ బాధ్యతాయుతంగా తీసుకోవాలని, సమయానుసారం మొక్కలకు నీటిని అందించాలని, చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటి సంరక్షించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కన్నెపల్లి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి రాధాకిషన్‌, సహాయ పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, భీమిని మండల డి.ఎల్‌పి.ఓ. ఫణిందర్‌రావు, ఏ.పి.ఓ. భాస్కర్‌రావు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post