MNCL : ప్రజలలో దృష్టి లోపాలను సవరించేందుకు కంటి వెలుగు కార్యక్రమం : జిల్లా ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

రాష్ట్రంలో ప్రజల దృష్టి లోపాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని జనవరి 18, 2029 నుండి ప్రారంభించడం జరుగుతుందని జిల్లా ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ఆరోగ్యశాఖ కమీషనర్‌ శ్వేత, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజల దృష్టి లోపాలను సవరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని, కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంపై అధికార యంత్రాంగం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని, కంటి వెలుగు పథకం అమలు కొరకు పూర్తి న్థాయి కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా నిర్వహించాలని, కార్యక్రమ నిర్వహణ కొరకు 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు పాటు నిర్వహించి 827 బృందాలతో 1కోటి 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 2వ విడత కార్యక్రమాన్ని 100 రోజులలో పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఇందు కొరకు వేయి 500 బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు పురపాలక, పంచాయతీరాజ్‌ అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందించుకోవాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకోవాలని తెలిపారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక పూర్తయిన తరువాత జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై పకడ్బందీగా కార్యచరణ సిద్దం చేయాలని, రాష్ట్రంలో 3 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించడం లక్ష్యంగా నిర్ధేశించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 5 శాతం బఫర్‌ టీమ్‌ (అడ్వాన్స్‌ టీమ్‌)లను ఏర్పాటు చేసుకోవాలని, 960 మంది వైద్యులను వారం రోజుల్లోగా నూతన నియామకాలు చేపడుతున్నామని, వైద్య-ఆరోగ్యశాఖ పరిధిలోని రోజువారి కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యచరణ ఉండాలని తెలిపారు. మండల, జిల్లా, పురపాలక సంఘ సమావేశాలలో కంటి వెలుగుపై చర్చించి ప్రజాప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేయాలని తెలిపారు. కంటి వెలుగు శిబిరంలో దృష్టి లోపాలతో బాధపడే వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలందరికీ తెలిసే విధంగా పురపాలక సంఘలు, గ్రామీణ ప్రాంతాలలో వినత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. మండల స్థాయిలో నోడల్‌ అధికారిని నియమించాలని, ప్రతి రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్యచరణ ప్రకారంగా పనిదినాలలో శిబిరాలు నిర్వహించాలని అన్నారు. ప్రాథమిక వైద్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు గాను, పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేస్తున్న ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన నిర్మాణాలు, మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాహుల్‌, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post