MNCL : ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిషారానికి సంబంధిత అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన రావి మనోహర్‌ తన సోదరులతో కలిపి చెన్నూర్‌ మండలం నాగాపూర్‌ శివారులో జాయింట్‌ పట్టాపై భూమి ఉందని, ఇట్టి భూమిని తన సోదరులలో ఒకరు మిగతా వారికి తెలియకుండా విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేశారని, ఇట్టి విక్రయాన్ని కొనుగోలుదారుకు జారీ చేసిన పట్టాను రద్దు చేసి భూమిని జాయింట్‌గా రిస్ట్రోర్‌ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మందమర్రి మండలం నార్లాపూర్‌ 6వ వార్డుకు చెందిన ఆకుల భాగ్యలక్ష్మీ తన భర్తకు రేచీకటి ఉందని, కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మందమర్రి మండలం అమరవాది గ్రామానికి చెందిన మేరుగు బ్రహ్మయ్య తమ కుటుంబం 1954-55 నుండి సాగు చేసుకుంటూ జీవిస్తున్న భూమిని ధరణిలో తన పేరిట పట్టా మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఇట్టి భూమిలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ వారు స్మశానవాటిక నిర్మాణం చేపడుతున్నారని, దీనిని నిలుపుదల చేసి న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణం ఏ.సి.సి. ప్రాంతానికి చెందిన బోనం లక్ష్మీకాంతమ్మ తన భూమికి సంబంధించి ప్రభుత్వ జీ.ఓ. 59 ప్రకారం డి.డి. చెల్లించడం జరిగిందని, సంవత్సరాలు గడుస్తున్న ఇట్టి క్రమబద్దీకరించబడలేదని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన లింగాల శ్రీనిధి తనకు గ్రామ శివారు నందు వారసత్వంగా సంక్రమించిన భూమి ఉందని, ఇట్టి భూమి వివరాలను ధరణిలో నమోదు చేసి నూతన పట్టా పాస్‌ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తమ దరఖాస్తులో ప్రభుత్వం “మన ఇసుక వాహనంి ద్వారా అనుమతించడంతో దాదాపు 300 ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరిగిందని, ఈ సంవత్సరం ఇంకా అనుమతించకపోవడంతో ట్రాక్టర్ల డైవర్లు, కూలీలకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. జైపూర్‌ మండలం మద్దికల్‌ గ్రామానికి చెందిన చీర్ల లక్ష్మీ తను గ్రామ శివారులో వారసత్వంగా సంక్రమించి భూమి ఉందని, ఇట్టి భూమి వివరాలు ధరణిలో ఇతరుల పేరుపై ఉన్నాయని, ఈ వివరాలను సవరించి పట్టా పాస్‌ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణం ఎల్‌.ఐ.సి. కాలనీకి చెందిన కుదురుపాక శ్రీలత తాము 8 సం॥లుగా కిరాయి ఉంటున్నామని, రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం క్యాతనపల్లి-శేషుపల్లి గ్రామానికి చెందిన మాటేటి సరోజ, దుబ్బపల్లి గ్రామానికి చెందిన మేరుగు హేమలత తాము రిజిస్టేషన్‌ ద్వారా కొనుగోలు చేసి భూమి వివరాలు ధరణిలో ఇతరుల పేరుతో ఉన్నాయని, సవరించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన బుట్టి శంకర్‌ తన పేరిట గల భూమిని తన కుమారుని పేరిట మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కన్నెపల్లి మండలం వీరాపూర్‌ గ్రామానికి చెందిన పోతరాజుల చంద్రయ్య తనకు గ్రామంలోని దుబ్బగూడె ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ వలన ముంపుకు గురైన తన భూమికి సంబంధించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post