MNCL : ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు : జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌

ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన దరావత్‌ తిరుపతి, లావణ్య, రమేష్, మహారాజ్‌లు తమ తండ్రి పేరిట దుబ్బగూడెం గ్రామంలో భూమి, తమ తల్లి పేరిట ఇల్లు ఉండగా ఓపెన్‌కాస్టులో పోతున్నాయని, డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి తన బంధువుల పేరిట మార్పిడి చేసుకున్నాడని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మేడపట్ల సతీష్‌ తన దరఖాస్తులో జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన రెండు పడక గదుల ఇండ్లను అందజేసేందుకు ఇల్లు లేని అర్హులైన దివ్యాంగులను గుర్తించాలని, స్థం కలిగి ఉన్న దివ్యాంగులకు ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం చేయాలని, మీ సేవలో సదరం స్లాట్‌ లభించని శారీరక దివ్యాంగులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు. బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లి గ్రామానికి చెందిన పచ్చునూరు సంధ్యారాణి, తరహర్ల ప్రవళిక తాము గత సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నామని, పోడు పట్టాల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇచ్చిన సందర్భంలో అనారోగ్య కారణాల వలన దరఖాస్తు చేసుకోలేదని, ఇదే సమయంలో ఈ భూమిని కొందరు ఆనైన్‌ చేసుకున్నారని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన వేల్పుల రాజేష్‌ తాను దళితుడినని, ఎస్‌. సి. కార్పొరేషన్‌లో రుణ సదుపాయం కొరకు దరఖాస్తు చేసుకున్నానని, అధికారులు యూనిట్‌ మార్చుకోవాలని తెలిపారని, అందుకు యూనిట్‌ మార్చుకొని తిరిగి దరఖాస్తు చేసుకున్నానని, మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post