ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో భై ట్రైనీ కలెక్టర్ పి .గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన రామటెంకి అనూష తాను రిజిస్టర్ కాబడిన ఫిష్ పాండ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రమంలో చేపలకు సే స్నహ కంపెనీ ఫీడ్ వినియోగించడం జరుగుతుందని, ఖర్చు భారమైనందున రాయితీపై ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ కార్మికులకు జీ.ఓ.ఎం.ఎస్.నం.64 ప్రకారం వేతనం పెంచి చెల్లించాలని కోరుతూ పార్ట్ టైమ్ కార్మికులు అర్జీ సమర్పించారు. జన్నారం మండలం బాదంపల్లి గ్రామానికి చెందిన గూడెపు లక్ష్మీ తాను బాదంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకంలో గత సంవత్సరాలుగా వంట మనిషిగా పని చేస్తున్నానని, తనను అకారణంగా విధుల నుండి తొలగించారని, తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన మోతె గౌరిదేవి తన భర్త మృతి చెందినందున ఆయన నిర్వహిస్తున్న టేలాను గత సంవత్సరాలుగా నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నానని, ఇట్టి టేలా శిథిలావస్థకు చేరినందున టేలా నిర్మాణానికి కొద్దిపాటి స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వోజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన యెసంత శంకరమ్మ తన భర్త 2021లో కొవిద్ కారణంగా మృతి చెందాడని, సంబంధిత పరిహారం ఇంత వరకు అందలేదని, ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దందేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజలింగు తనకు గ్రామ శివారులో గల భూమిని అక్కల రాజయ్య అనే అతనికి కౌలుకు ఇవ్వడం జరిగిందని, ఆయన మరణానంతరం అతని కుమారులు కౌలు చేశారని, ప్రస్తుతం ఇట్టి భూమిని తనకు తెలియకుండా వారి పేరిట మార్పు చేసుకున్నారని, ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. లక్షైట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.