MNCL : ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు చాలా విలువైనది : జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకత్వం ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధి, సంక్షేమంపై విశిష్ట ప్రభావం చూపే ఓటు హక్కు ప్రజలకు చాలా విలువైనదని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ తెలిపారు. మంగళవారం జిల్లా 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. 1950 జనవరి 25న దేశంలో ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఎన్నికల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివృద్దికి సుపరిపాలన అందించే సమర్థవంతమైనా నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, నిస్పక్షపాతంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకొని ఓటు హక్కు పొందాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ వివరాలు ఓటర్ల జాబితాలో పరిశీలించుకోవాలని, లేని పక్షంలో వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.

“భారతదేశ పొరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిస్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము”.

అనంతరం వీడియో ద్వారా రాష్ట్ర గవర్నర్‌ సందేశాన్ని అందరితో కలిసి తిలకించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post