MNCL : ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని నస్పూర్‌ మండలం అరుణక్కనగర్‌ కాలనీ వాసులు తాము దాదాపు 25 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా నివాసం ఉంటున్నామని, ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. నం.76 ప్రకారం క్రమబద్దీకరణ కొరకు డబ్బులు చెల్లించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని, మాకు ఇండ్ల పట్టాలు ఇప్పించి, విద్యుత్‌, మురుగు కాలువలు, రోడ్డు సదుపాయలు కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాసిపేట మండల కేంద్రానికి చెందిన బోగె రాజేశ్వరి తన ఇల్లు కె.కె. ఓపెన్‌కాస్టులో పోతుండగా నష్టపరిహారం డబ్బులు తక్కువగా లెక్కించడం జరిగిందని, స్లాబ్‌తో కూడిన తన ఇంటిపై పునర్విచారణ జరిపించి నష్టపరిహారం డబ్బులు పెంచి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి ప్రాంతానికి చెందిన తాళ్ళపెల్లి తారక్క తనకు వృద్ధాప్య ఫించన్‌ ఆసరా గుర్తింపు కార్డు వచ్చిందని, కాని ఫించన్‌ డబ్బులు రావడం లేదని, నిరుపేదనైన తనకు ఫించన్‌ డబ్బులు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి మండలం దీపక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కదం లక్ష్మీ తనకు 60 సం॥ల వయస్సు ఉందని, చెవులు వినిపించవని, తనకు సదరన్‌ సర్టిఫికెట్‌తో పాటు ఫించన్‌ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్‌ మండలం ముల్మల్ల గ్రామానికి చెందిన ఆవుల వెంకటస్వామి తనకు 2018 సం॥లో జరిగిన ప్రమాదంలో కుడి కన్ను పూర్తిగా కోల్పోయానని, కూరీ పని చేసుకుంటూ జీవించే తనకు దివ్యాంగుల పెన్షన్‌ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వాజీపూర్‌ మండలం గఢథ్‌పూర్‌ గ్రామానికి చెందిన దమ్మాల లక్ష్మణ్‌ తన తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన సూరమల్ల రాజయ్య, తండ్రి : బక్కయ్య, సూరమల్ల రాజయ్య, తండ్రి చంద్రయ్యలు తమకు గ్రామ శివారులో వారసత్వంగా వచ్చిన భూమి ఉందని, ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి దొంగ కాగితాలు సృష్టించి ప్రొసీడింగ్‌ తీసుకొని ఆన్‌లైన్‌లో తన పేరు నమోదు చేసుకొని తన భూమి అని మమ్ములను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఈ విషయంపై పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. లక్షెట్టిపేట మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన పోతరవేని భూలక్ష్మీ తాను తోటగూడ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట కార్మికురాలిగా గత 20 సంవత్సరాలు నుండి పని చేస్తున్నానని, తన భర్త ఆసరా పెన్షన్‌ దరఖాస్తు కొరకు ఆన్‌లైన్‌లో వివరాల నమోదు సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా తన వివరాలు నమోదు చేశారని, సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను ఆయా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post