ప్రజా సేవలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి పట్టణంలో గల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సి.పి.ఆర్. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ గుండెపోటుకు గురైన వారిని అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడాలంటే సి.పి.ఆర్. విధానం తెలిసి ఉండాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించి సి. పి.ఆర్. అందించి ప్రాణాలు కాపాడవచ్చని, యువత సైతం సి.పి.ఆర్. అమలు విధానాన్ని తెలుసుకోవాలని తెలిపారు. బెల్లంపల్లి పరిధిలో సి.పి.ఆర్., ఎ. ఈ.డి. అమలు విధానంపై 27 కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కరోనాకు గురైన వారు గుండెపోటుకు ఎక్కువగా గురవుతున్నారని, గుండెపోటుకు గురైన సమయంలో ప్రాణాలు కాపాడటంలో సి.పి.ఆర్.
విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రజల కంటి సమస్యలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 311 గ్రామపంచాయతీలు, 174 వార్డులు ఉన్నాయని, (గ్రామీణ ప్రాంతాలలో 5 లక్షల 12 వేలు, పట్టణ ప్రాంతాలలో 3 లక్షల 91 వేల జనాభా ఉందని, 18 సం॥లు వయస్సు నిండిన అందరికీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కంటి వెలుగు శిబిరాలకు మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. మారుమూల ప్రాంతాలలో ఉన్నవారికి కన్న కొడుకు లాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సేవలు అందిస్తున్నారని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు సన్నద్దమవుతున్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి కంటి శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి 100 రోజుల కార్యక్రమం అనంతరం తేదిని నిర్ణయించి చికిత్స అందించడం జరుగుతుందని, 1 లక్షా 34 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా 62 శాతం సాధించడం జరిగిందని, 162 గ్రామపంచాయతీలు, 80 మున్సిపల్ వార్డులు మొత్తం 242 ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజా సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని అన్నారు. బీడీ కార్మికులకు 10 కోట్ల 54 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరానికి 20 వేల మంది గుండెపోటు కారణంగా మరణానికి గురవుతున్నారని, సి.పి.ఆర్. విధానం ద్వారా మరణాలను దాదాపు 50 శాతం వరకు నియంత్రించవచ్చని తెలిపారు. ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్.టి.సి. అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, సంక్షేమ సంఘాల సభ్యులు సి.పి.ఆర్. చేయడం తెలిసి ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని, గుండె నొప్పికి గురైన బాధితుడికి సత్వర చికిత్స అందించి ఆసుపత్రికి చేరే లోపు ప్రమాదం నుండి తప్పించవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం సి.పి.ఆర్. శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందని, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్.డి.ఓ. శ్యామలాదేవి, మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు, డి.సి.సి.బి. చైర్మన్
రాజారెడ్డి, డి.సి.ఎం.ఎస్. అధ్యక్షులు లింగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్వేత, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.