MNCL : ప్రతి వర్షపు నీటి చుక్కను వినియోగించడం కోసం జలశక్తి అభియాన్‌ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి వినియోగించడం కోసం ప్రభుత్వం జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమం క్రింద జిల్లాలో జరుగుచున్న పనుల పరిశీలనార్థం కేంద్ర బృందం సభ్యులు డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖ సంచాలకులు ప్రీతమ్‌సింగ్‌, సి.జి. డబ్యు.డి. జియోహైడ్రాలజీ శాస్త్రవేత్త సుధీర్‌కుమార్‌, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి లతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుచున్న జలశక్తి అభియాన్‌ పనులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఈ నెల 21 నుండి 28 వరకు పనులను పరశీలించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్‌ ఫైలట్‌ ప్రాజెక్టును దేశంలోని అన్ని జిల్లాలలో విస్తరించడం జరుగుతుందని, మార్చి-2020 న దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం ద్వారా వర్షపు నీరు ఎప్పుడు, ఎక్కడ పడినా పొదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా 4 వేల 16 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగి ఉందని, 1 వేయి 761 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉందని, జిల్లాలో జన్నారం, దండేపల్లి, కాసిపేట, భీమిని, నెన్నెల, జైపూర్‌, చెన్నూర్‌లలో వాటర్‌షెడ్‌ ఏరియాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి నది జన్నారం మండలం కలమడుగు గ్రామం వద్ద జిల్లాలోకి ప్రవేశించి లక్షెట్టిపేట, హాజీపూర్‌, మంచిర్యాల, జైపూర్‌, చెన్నూర్‌ లలో ప్రవహిస్తుందని, ప్రాణహిత నది వేమనపల్లి, కోటపల్లి మండలాలలో ప్రవహిస్తుందని తెలిపారు. వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెంపొందించేందుకు వివిధ పద్ధతుల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సంబంధిత 14 శాఖల అధికారులతో జలశక్తి కేంద్ర ఏర్పాటు చేసి, సంబంధిత పనులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా అటవీ శాఖల క్రింద చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని భారీ నీటి ప్రాజెక్టులు శ్రీపాద ఎల్లంపల్లి, పార్వతి, సరస్వతి, మధ్యతరహా నీటి ప్రాజెక్టులు ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులు, 852 చెరువులు, ఇంకుడు గుంతలు, ఫిష్‌ పాండ్స్‌తో పాటు జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు పల్లెప్రకృతి వనాలు, బృహత్‌ పల్లెప్రకృతి వనాలు, హరితహారం కార్యక్రమాలలో నిర్ధేశించిన లక్ష్యాలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం క్రింద 76 వాటర్‌ బాడీస్‌ను అభివృద్ధి, పునరుద్దరణ చేయడం జరుగుతుందని, వివిధ శాఖల సమన్వయంతో 63 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని, అటవీ శాఖ ఆధ్వర్యంలో 41 మినీ-పెర్కొలేషన్‌, 18 పెర్కొలేషన్‌, 12 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీటి వనరుల అభివృద్ధి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వివిధ రకాల నీటి పొదుపు కార్యక్రమాల క్రింద 4 వేల 117 పనులు మంజూరు కాగా 8 వేల 484 పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జలశక్తి అభియాన్‌ కార్యక్రమ నిర్వహణ, పనులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ, జిల్లా పంచాయతీరాజ్‌, భూగర్భ జల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post