ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వమే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. పోలీసు ఎస్.ఐ., కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు జిల్లాలోని 13వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు శనివారం డి.సి.పి. అఖిల్ మహాజన్, బెటాలియన్ కమాండెంట్ యం.రామకృష్ణ, అదనపు కమాండెంట్ సురేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ ఉండటం వలన జిల్లా పరిధిలోనే ఉద్యోగ నియామకం జరుగుతుందని, పరీక్షల కోసం శిక్షణ తీసుకోవడం కోసం కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యయప్రయాసల ఇబ్బందులు లేకుండా జిల్లాలోనే ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని, ప్రతి అభ్యర్థి ఇదే చివరి అవకాశంగా భావించి పోటీతత్వంతో కష్టపడి ఉద్యోగం సాధించాలని, అభ్యర్థులు ఏకా(గతతో చదువుకునే విధంగా అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మనం ఎంత అయితే కష్టపడితే లభించే ప్రతిఫలం అంత బావుంటుందని తెలిపారు. కొవిడ్ విజృంభణ సమయంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వారు ఉద్యోగం కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో కుటుంబ ఆర్థికపరంగా అభివృద్ధి చెందడంతో పాటు సమాజానికి సేవలు అందించవచ్చని తెలిపారు. ఎండలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్వా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు. అనంతరం అభ్యర్థులకు అందించే మధ్యాహ్న భోజనం, ఇతర వసతులను పరిశీలించి స్వయంగా వడ్డించారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఆర్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ.లు, పటాలపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.