ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. జి.సి. సుబ్బారాయుడు, ఆసుపత్రి పర్యవేక్షకులు డా. హరిశ్చంద్రారెడ్డితో కలిసి సందర్శించి ఆసుపత్రిలోని పలు వార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత పాటించాలని, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఐ.సి.యు. వార్డులలో సిబ్బందిని. ఉంచాలని, ఆసుపత్రి పరిసరాలలో ప్రతి రోజు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు సమయానుసారంగా పోషకాహారాన్ని అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, సమన్వయంతో పని చేస్తూ రోగుల ఆరోగ్య రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని, మూత్రశాలలు, శాచాలయాలు, త్రాగునీటి సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన మహిళా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న సేవలు, జిల్లా ఆసుపత్రికి సిఫారసుపై వచ్చిన వారికి అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. అరవింద్, డా॥ నీరజ, ఆసుపత్రి సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.