ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతులు కలిగి ఉండటంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో వైద్యాధికారులు, ఆసుపత్రి పర్యవేక్షకులు, ప్రోగ్రామ్ అధికారులతో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2002 చట్టం ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణలో ప్రభుత్వ నియమ, నిబంధనలు అనుసరించాలని తెలిపారు. తనిఖీల నిర్వహణ కోసం నియమించిన 5 బృందాల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 194 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టగా 125 ప్రైవేట్ ఆసుపత్రులు సరైన అనుమతులు, ధృవపత్రాలు కలిగి ఉన్నాయని తెలిపారు. జిల్లాలో విదేశాలలో వైద్య విద్య చదివిన వారు 7 మంది వైద్యులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని, వారి ధృవపత్రాలు పరిశీలించడం జరిగిందని, 5 ఆసుపత్రులలో బయో మెడికల్ వేస్టేజ్ పద్దతులు పాటించడం లేదని, ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించడం జరిగిందని తెలిపారు. తనిఖీలలో అనుమతి కాలపరిమితి ముగిసిన 18 ఆసుపత్రులైన ఆర్.ఎస్. మల్టీస్పెషాలిటీ-డెంటల్, న్యూ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్, శ్రీనిధి ఆసుపత్రి, చైతన్య పిల్లల ఆసుపత్రి, మేధ న్యూరో కేర్ సెంటర్, ముద్ర మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్, పార్థ డెంటల్ హాస్పిటల్, సర్వోదయ ఆసుపత్రి, శ్రీకృప డెంటల్ క్లినిక్, ఎస్.ఆర్. షైన్ డెంటల్ క్లినిక్, వెన్నాల హాస్పిటల్, న్యూసిటీ హాస్పిటల్, రిథిక హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, సుధ ఫిజియోథెరపి, ప్రశాంతి హాస్పిటల్, శ్రీ తిరుమల డెంటల్ కేర్ హాస్పిటల్, దుర్గాభవాని ఫిజియోథెరపి క్లినిక్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు పెరిగే విధంగా ప్రజల్లో ప్రచారం నిర్వహించాలని, ఇంటి వద్ద కాకుండా ఆసుపత్రులలో ప్రసవాలు జరిగే విధంగా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ప్రచారంలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, గామపంచాయతీల పరిధిలో గోడప్రతులు, కరపత్రాలు వినియోగించాలని, పురపాలక సంఘాలలో హోర్దింగ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళలు తమ వివరాలను సమీప ఆసుపత్రులలో తమ వివరాలు నమోదు చేసుకొని క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించుకునేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఇందులో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్శర్లు తమ పరిధిలో ప్రజలందరికీ తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి జి.సుబ్బారాయుడు, ఆసుపత్రి పర్యవేక్షకులు అరవింద్, ఉప వైద్యాధికారి ఫయాజ్ఖాన్, ప్రోగ్రామ్ అధికారులు నీరజ, బాలాజీ, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.