MNCL : ప్రైవేట్‌ ఆసుపత్రులు అన్ని అనుమతులతో క్రమబద్దంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు, ధృవపత్రాలు కలిగి ఉండాలని, ఆసుపత్రి నిర్వహణలో నియమావళి తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడుతో కలిసి జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 194 ఫ్రైవేట్స్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించాలని, అనుమతులు, ఆసుపత్రి భవనాలు, ఏర్పాట్లు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి క్షుజ్ణంగా పరిశీలించడంతో పాటు ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ , స్కానింగ్  సెంటర్లను పర్యవేక్షించాలని, నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల అనుమతులు, సంబంధిత ధృవపత్రాలు కాలపరిమితి ముగిసిన వాటిని పునఃరుద్దరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని, ఆసుపత్రులను కేటగిరీల వారిగా విభజించి జాబితా తయారు చేయాలని, కేటగిరీలో లేని వాటిని సస్పెండ్‌ చేయాలని సూచించారు. విదేశాలలో వైద్య విద్య అభ్యసించి సేవలు అందిస్తున్న వైద్యుల ధృవపత్రాలు, అర్హతలను పరీక్షించాలని, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులలో ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌, మెడికల్‌ సర్టిఫికెట్లు, వైద్య సేవల సంబంధిత ధరలు సూచించే బోర్జు, ఇతరత్రా అన్ని వివరాలతో నివేదిక తయారు చేయాలని తెలిపారు. 42 సరైన అనుమతులు లేని ప్రైవేట్‌ ఆసుపత్రులను గుర్తించి వాటికి జరిమానా విధించి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ఇవ్వడం జరిగిందని, 5 బృందాల ద్వారా జిల్లాలోని 179 ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, 15 ఆసుపత్రులను పూర్తిగా మూసి వేయడం జరిగిందని, తనిఖీలు యదావిధిగా కొనసాగుతాయని తెలిపారు. గర్భిణులు ఇంటి వద్ద కాకుండా తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ప్రసవం చేసుకునే విధంగా వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు విసృత ప్రచారం నిర్వహించాలని, సిజేరియన్‌ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలు జరిగేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో గర్భిణులకు సంబంధించి రిజిస్టేషన్‌ చేయడంతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకునేలా ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్మర్లు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డా॥ ఫయాజ్‌ ఖాన్‌, ప్రోగ్రాం అధికారులు డా॥ బాలాజీ, డా॥ నీరజ, వైద్యాధికారులు డా॥ అనిత, విజయ పూర్ణిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post