MNCL : బతుకమ్మ పండుగను జిల్లాలో విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

బతుకమ్మ పండుగను జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ భారత హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బొడ్జెమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసే దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. బతుకమ్మ ఆడే ప్రాంతాలలో త్రాగునీరు, విద్యుత్‌ సరఫరాతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలలో రంగోలి, ఆట-పాటలు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 25న జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో బొడ్డెమ్మ కార్యక్రమం, 26న కార్మిక శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్‌, వ్యవసాయ శాఖలు, గిరిజన, మైనార్టీ సంక్షేమశాఖల మహిళా ఉద్యోగులతో, 27న జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులతో, 28న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, వి.ఓ.లతో, 29న జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాలని, 30న జిల్లాలోని పురపాలక సంఘాలలో ఆయా మున్సిపల్‌ కమీషనర్లు, గ్రామపంచాయతీలలో జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అక్టోబర్‌ 1వ తేదీన జిల్లా పంచాయతీ శాఖ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ శాఖ మహిళా ఉద్యోగులతో, 2వ తేదీన మహిళా ప్రజాప్రతినిధులతో, ౩న అన్ని శాఖల జిల్లా అధికారుల ఆధ్వర్యంలో అన్ని శాఖలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులతో సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో తమ పరిధిలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించి మైదానాలు, త్రాగునీరు, విద్యుత్‌ సరఫరా ఇతర మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ మైదానాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు చూడాలని, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంసృతిక సారథి కళాకారులచే కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post