MNCL : బాల్య వివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

బాల్యవివాహాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి డి.సి.పి. అఖిల్‌ మహాజన్‌, జిల్లా సంక్షేమాధికారిణి ఉమాదేవి, జిల్లా బాలల సంరక్షణ కమిటీ చైర్మన్‌ వాహిద్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిరోధించి, బాలలను విద్యావంతులు తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని, అమ్మాయికి 18 సం॥లు, అబ్బాయికి 21 సం॥ల వయస్సు నిండిన తరువాత వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని 1929లో రూపొందించి స్వాతంత్రానంతరం సవరించి 2006లో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆచారాలు, మూఢనమ్మకాల పేరుతో వివాహలు చేయడం వలన బాలలు తమ జీవితాలను కోల్పోతారని, బాలికలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని, మాతా శిశు మరణాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. బాల్య వివాహం జరుగుతుందన్న విషయం తెలిస్తే వెంటనే పోలీసు, జిల్లా సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ కమిటీకి 1098 లేదా 100 నంబర్లలో సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబదడతాయని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించినా, అనుమతించినా, నిర్వహించిన, సహకరించిన, హాజరైన వారు నేరస్తులుగా పరిగణించబడతారని, జైలు శిక్ష లేదా 1 లక్ష రూపాయల జరిమానా విధించబదడతాయని తెలిపారు. 2020 సం॥ నుండి జిల్లాలో దాదాపు 45 బాల్య వివావాలను అధికార యంత్రాంగం నిరోధించడం అభినందనీయమని అన్నారు. వివాహాలు జరిపించే సమయములో మత పెద్దలు తప్పనిసరిగా వధూవరుల వయస్సు ధృవపత్రాలను పరిశీలించి వయస్సు నిర్ధారణ తరువాత వివాహం జరిపించాలని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణ దిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంలో బాల్య వివాహాల నియంత్రణపై జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వీధి బాలల సంరక్షణలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వీధి బాలలు, బడి బయట పిల్లలు, బాల కార్మికులను గుర్తించి జిల్లా బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వారికి పునరావాసం, అవసరమైన వసతులు కల్పించడంతో పాటు విద్య అందించాలని తెలిపారు. అనంతరం బాల్య వివాహాల నియంత్రణపై గోడప్రతులు, పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, ఆయా మండలాల తహళిల్దార్హు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, వైల్డ్‌ లైన్‌, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post