రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో అన్ని రకాల
వసతులతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని ఫిల్టర్ బెడ్ ఏరియాలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, లక్షైట్టిపేట మండలం గుల్లకోట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు – మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలో 248 పాఠశాలలను ఎంపిక చేసిన ఆ పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలో అన్ని పనులు పూర్తి అయిన పాఠశాలలను ప్రారంభించడం జరిగిదని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులు ఇష్టంతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ దిశగా ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ద్వారా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువుకునేందుకు ప్రభుత్వం కార్యచరణ అమలు చేస్తుందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు పరిశుభ్రత పాటించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో వంటశాల, భోజనశాల, ప్రహారీగోడ, మూత్రశాలలు, త్రాగునీరు, సౌకర్యవంతమైన గదులు, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం జరిగిందని, విద్యార్థులు తాము ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాము అని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుకుంటున్నారు అని గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్చర్లు, మందమర్రి మున్సిపల్ కమీషనర్ రాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.