MNCL : మన రేపటి భవిష్యత్తు కోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశమే “ఓటు హక్కు” : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

మన రేపటి భవిష్యత్తు కోసం సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశమే “ఓటు హక్కు” అని, అర్హత గల ప్రతి ఒక్కరు ఎన్నికలలో తమ ఓటు హక్షు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం 18వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మధుసూదన్‌ నాయక్‌, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వేణుతో కలిసి హాజరై అందరితో జాతీయ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికలలో వినియోగించుకోవాలని తెలిపారు. నూతన ఓటరు నమోదు కొరకు ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 18 సంలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. గతంలో ఓటరు నమోదుకు ప్రామాణికంగా ఉన్న జనవరి 1వ తేదీని ఓటర్ల సౌకర్యార్థం మార్పు చేస్తూ జనవరి 1, ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, 18 సం॥|లు నిండిన వారు జనవరి 1వ తేదీ వరకు వేచి చూడకుండా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 17 సం॥లు నిండిన వారు ముందుగానే తమ వివరాలను ఎన్‌రోల్‌ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని, 18 సం॥లు నిండిన తరువాత ఓటరు జాబితాల వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొనే హక్కు రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి కల్పించిందని, దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఓటు హక్కును అర్హత గల ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారు వారి ఓటు నమోదుపై పరిశీలించుకోవాలని, ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో పేరు కలిగిన ప్రతి ఒక్కరు తమ వివరాలను సరి చూసుకోవాలని తెలిపారు. ప్రజలు తాము ఉన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు తమ ఓటును తప్పనిసరిగా ప్రస్తుత ప్రాంతానికి బదిలీ చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విబేధాలకు తావు లేకుండా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటును నిస్పక్షపాతంగా, పారదర్శకంగా వినియోగించుకున్నప్పుడే సమర్థవంతమైన నాయకత్వం ఎన్నుకోబడుతుందని అన్నారు. ఎన్నికల ఒక్క రోజు నగదు, వస్తువులు ఇతర ప్రలోభాలకు లోనట్లయితే 5 సంవత్సరాల కాలం మనతో పాటు మన కుటుంబ జీవితాలను వారికి రాసి ఇచ్చినట్లేనని తెలిపారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని, దేశ జనాభాలో మహిళలు దాదాపు 50 శాతం ఉన్నారని, యువత, మహిళలు ముందుకు వచ్చి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని
తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని, మార్చు అనేది మొదటగా మన నుండి వ్యక్తిగతంగా ప్రారంభమవ్వాలని, ఎన్నికలు మన రేపటి మన భవిష్యత్తు కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడమేనని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఓటరు జాబితా రూపకల్పనలో అధికార యంత్రాంగం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు పాత్ర పోషించాలని, ఎలాంటి పొరపాట్లు లేని ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పటికీ ప్రభుత్వ పరంగా, భారత ఎన్నికల సంఘం పరిధిలో నిరంతరాయంగా ఎన్నికల సంబంధిత పనులు జరుగుతూనే ఉంటాయని, ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన బూత్‌ స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలు అందించడంతో పాటు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post