MNCL : రైతాంగ పోరాటంలో వీరవనిత చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

భూమి, భుక్తి కోసం రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజ హితం కొరకు ప్రజలు గురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహాసాలు చిరస్మరణీయమని అన్నారు. మహిళలు ఇల్లు దాటి బయటకు రాని రోజుల్లో తన భూమి, పండించిన పంటపై సర్వహక్కులు తనకు ఉన్నాయని పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. సాయుధ పోరాట కాలంలో హక్కుల కోసం పోరాడారని, చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను భావితరాలు తెలుసుకునే విధంగా ప్రభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళలు ఇంటికి మాత్రమే పరిమితమైన సమయంలో ఒక మహిళగా సమాజ శ్రేయస్సు కోసం పోరాడారని తెలిపారు. సాయుధ పోరాటంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సేవలు సైతం అందించారని, రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడారని, మన సమస్యలను ఎవరో వచ్చి పరిష్కరిస్తారని ఎదురు చూడకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకునే విధంగా ముందుకు సాగాలని తెలిపారు. దేశం కోసం పోరాడిన మహనీయులు ఏ ఒక్క కుల, మత, జాతి, వర్ణ, వర్షాలకు చెందిన వారు కాదని, వారు దేశానికి చెందిన వారని అన్నారు. మహనీయులు చూపిన మార్గదర్శకాలను అనుసరిస్తూ తెలంగాణ రాష్ష్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం రజక సంఘం సీనియర్‌ నాయకుడు తోటపల్లి రాజయ్యను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌, రాజస్వ మండల అధికారి వేణు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌, రజక సంఘ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post