MNCL : రైతులకు నష్టం వాటిల్లకుండా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్‌మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లతో వడ్ల సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల నుండి రైస్‌మిల్లులకు వరిధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులు, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేయాలని, గన్నీ సంచుల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలం అయినందున కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఓ.ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైస్‌మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వరిధాన్యాన్ని వెంటనే దించుకొని లారీలను పంపించాలని తెలిపారు. అకాల వర్షాలకు వరిధాన్యం తడవకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్‌, రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, డి.సి.ఎం.ఎస్‌. చైర్మన్‌ టి.లింగన్న రైస్‌మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

 

Share This Post