MNCL : రైతు సంక్షేమం దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వం : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తూ అహర్నిశలు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో శనివారం రైతు దినోత్సవంలో భాగంగా జిల్లాలోని కాసిపేట మండలం కాసిపేట, బెల్లంపల్లి మండల గురిజాల క్లస్టర్‌లలోని రైతువేదికలలో ఏర్పాటు చేసిన వేడుకలకు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి ముందుగా రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఎడ్లబండ్లతో ర్యాలీగా డప్పు వాయిద్యాల నడుమ రైతువేదికలకు చేరుకొని బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 2 నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించ తల పెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వివరిస్తూ రైతు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, జిల్లాలోని 55 రైతువేదికలలో సంబంధిత అధికారులు సమన్వయంతో రైతు సంఘాల ప్రతినిధులు, రైతుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు పథకం ద్వారా పంటలకు పెట్టుబడి సాయం అందిస్తూ ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయడంతో పాటు రైతుభీమా అమలు చేయడం జరుగుతుందని, 24 గంటల పాటు నిరంతరంగా ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. 2014 సంవత్సరంకు ముందు జిల్లాలో 92 వేల ఎకరాలు ఉన్న వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని 3 లక్షల 36 వేల ఎకరాలకు పెంచడం జరిగిందని, నీటిపారుదల సౌకర్యం 27 ఎకరాలు ఉన్న దానికి 1 లక్షా 50 వేల ఎకరాలకు పెంచడం జరిగిందని, వరిసాగు 27 వేల ఎకరాల విస్తీర్ణాన్ని 1లక్షా 57 వేల ఎకరాలకు పెంపొందించడం జరిగిందని తెలిపారు. వరిధాన్యం సాగు చేసిన రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ విభాగంలో వ్యవసాయ విస్తరణ అధికారులు 5 మంది మాత్రమే ఉన్న జిల్లాలో 55 రైతు వేదికలు ఏర్పాటు చేసి 55 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగిందని, జిల్లాలో రైతుబంధు పథకం క్రింద 12 లక్షల 68 వేల 225 మంది రైతులకు 1 వేయి 458 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, రైతు భీమా పధకాన్ని 1 వేయి 702 మంది రైతులకు వర్తింప చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. అకాల వర్షానికి వరిధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త వహించాలని, ఇందుకు అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉ ౦చడం జరిగిందని, భూసారాన్ని బట్టి రైతులు సాగు చేయవలసిన ధాన్యం రకాన్ని రైతువేదికలలో వ్యవసాయ, విస్తరణాధికారులు తెలియజేస్తారని, మెళకువలు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు పొందిన రైతులు తమ తోటి రైతులకు పథకాల వివరాలను తెలియజేయాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు జరుగనున్న దశాబ్ది ఉత్సవాలను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహశిల్దార్ దిలీప్‌, మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post