MNCL : వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు దాసరి వేణు, శ్యామలాదేవి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ. ప్రేమ్ కుమార్, తహసిల్దార్లతో వరి ధాన్యం కొనుగోలు, రవాణా, ఇండ్ల పట్టాల పంపిణీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించడం ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకి వచ్చే రైతుల సౌకర్యం త్రాగునీరు, నీడ వసతులు కల్పించడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యం సంబంధిత రసీదును రైతుకు అందజేయాలని, వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ లలో నమోదు చేయాలని తెలిపారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు టాకింగ్ చేసిన రైసు మిల్లులకు తరలించాలని, గన్నీ సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో దాని ఉండకుండా రైసు మిల్లులకు, ఇంటర్మీడియట్ గోదాములకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల నుండి దాన్యం తీసుకువచ్చిన లారీల నుండి త్వరగా దిగుమతి చేసుకొని తిరిగి పంపించాలని తెలిపారు. లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులు ధాన్యం తరలింపునకు అధికారులతో కలిసి పని చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో సంబంధిత సొమ్ము చెల్లింపులు త్వరగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూన్ 2, 3 తేదీలలో దరఖాస్తులు స్వీకరించి, 4, 5 తేదీలలో పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 6వ తేదీన పట్టాలు పంపిణీ చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.
 

Share This Post